

ఇజ్రాయెల్‌లో 2026 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాజకీయ అనిశ్చితికి దారితీశాయి. మొత్తం 120 స్థానాలున్న పార్లమెంట్ (కెన్నెసెట్)లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 61 సీట్ల మెజార్టీని ఏ కూటమి సాధించలేకపోయింది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్ కూటమికి 53 సీట్లు రాగా, మాజీ సైన్యాధిపతి గడీ ఐసెన్‌కోట్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమికి 48 స్థానాలు దక్కాయి. అరబ్ పార్టీలకు కలిపి 19 సీట్లు వచ్చాయి. వ్యక్తిగత పార్టీల పరంగా నెతన్యాహుకు చెందిన లికుడ్ 27 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలవగా, ఐసెన్‌కోట్ నేతృత్వంలోని యాషర్ పార్టీకి 21, నఫ్తాలీ బెన్నెట్ పార్టీ బి'యచాద్కు 12, జాయింట్ లిస్ట్‌కు 11 సీట్లు లభించాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటులో అరబ్ పార్టీల మద్దతు కీలకంగా మారింది.
ఈ రాజకీయ ప్రతిష్టంభనను అధిగమించేందుకు ప్రధానంగా నాలుగు మార్గాలు కనిపిస్తున్నాయి. మొదటిది.. నెతన్యాహు, ప్రతిపక్షాలు కలిసి ఐక్యతా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. అయితే ఇరు పక్షాల మధ్య తీవ్ర రాజకీయ విభేదాలు దీనికి అడ్డంకిగా ఉన్నాయి. రెండోది.. ప్రతిపక్ష కూటమిలోని కొందరు సభ్యులను తమవైపు తిప్పుకొని నెతన్యాహు మెజార్టీ సాధించడం. మూడోది.. అరబ్ పార్టీల మద్దతుతో ఐసెన్‌కోట్ నేతృత్వంలో ప్రతిపక్ష ప్రభుత్వం ఏర్పాటు కావడం. అయితే ఈ ప్రతిపాదనపై ప్రతిపక్ష పార్టీల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. నాలుగోది.. ప్రభుత్వ ఏర్పాటుపై ఏకాభిప్రాయం కుదరకపోతే మరోసారి ఎన్నికలకు వెళ్లడం. ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జాగ్ రాజకీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపి ప్రభుత్వ ఏర్పాటుకు ఒక నేతకు అవకాశం ఇవ్వనున్నారు. నవంబర్ 4న తుది ఫలితాలను అధ్యక్షుడికి సమర్పించనుండగా, కొత్త పార్లమెంట్ నవంబర్ 10న కొలువుదీరనుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!