

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పతనం ప్రారంభమవుతుందని వ్యాఖ్యానించారు. సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన బేగంపేటలోని జొరాస్టియన్ క్లబ్‌లో నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, తలసాని సాయికిరణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హరీశ్ రావు ఆరోపించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు నిలిచిపోవడంతో విద్యా సంస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, ఉద్యోగాల భర్తీ, ఉద్యోగుల వేతన సవరణ, కరువు భత్యాల పెండింగ్ అంశాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆయన విమర్శించారు. హైడ్రా, 22ఏ అంశాలతో పాటు అవినీతి కారణంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిన్నదని ఆరోపించారు. సిరిసిల్ల పర్యటనపై స్పందిస్తూ, బీఆర్‌ఎస్ కార్యకర్తలను పెద్ద సంఖ్యలో అరెస్టు చేస్తున్నారని ఆరోపించిన హరీశ్ రావు, అక్కడి ప్రజలు ప్రభుత్వానికి తగిన సమాధానం చెబుతారని అన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!