

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్న సీఎం, బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశమై పీసీసీ క్రమశిక్షణ కమిటీ నివేదికపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నివేదికలో మంత్రి కొండా సురేఖతో పాటు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వ్యవహారాలపై ప్రస్తావన ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సీఎం తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, సురేఖపై కఠిన చర్యలకు ఆయన మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం జోక్యం చేసుకుంటే తుది నిర్ణయంలో మార్పులు ఉండే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదే పర్యటనలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అభివృద్ధి ప్రాజెక్టులపై సీఎం పలువురు కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను, మామునూరు విమానాశ్రయం పురోగతిపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కలవనున్నారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు ఫ్యూచర్ సిటీలో జరగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సదస్సు నేపథ్యంలో పలు రక్షణ రంగ సంస్థలతో ఒప్పందాలపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో కూడా సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రాజెక్టులు, పెట్టుబడులు, మౌలిక వసతుల అభివృద్ధిపై ఈ పర్యటనలో కీలక చర్చలు జరగనున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!