

ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలను అభివృద్ధి చేసేందుకు పార్లమెంట్ సభ్యులకు.. కేంద్రప్రభుత్వం ఏటా రూ.5 కోట్ల చొప్పున నిధులను కేటాయిస్తున్నప్పటికీ, వాటిని ఖర్చు చేయటంలో ఎంపీలు వెనుకబడుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కూడా దీనికి మినహాయింపు కాదని కేంద్రం తాజాగా విడుదల చేసిన వివరాలతో వెల్లడైంది. వీరిలో కేంద్ర మంత్రులు కూడా ఉండటం విశేషం.
2024లో మోదీ రెండవసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ దేశంలోని 36రాష్ట్రాల ఎంపీలకు రూ.11,681 కోట్లు విడుదల చేయగా, ఆ మొత్తంలో రూ.3,964 కోట్లు మాత్రమే(33.9%) ఖర్చు పెట్టారు. నాగాలాండ్ ఎంపీలు తమకు లభించిన ఎంపీలాడ్స్ నిధుల్లో 94.6% ఖర్చు చేసి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచారు. ప్రధాని మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో ఎంపీలు కేవలం 26.87% నిధులనే అభివృద్ధి పనులకు ఖర్చు పెట్టారు.
తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణలో ఉభయసభలకు చెందిన ఎంపీలకు రూ.394 కోట్లు కేటాయిస్తే రూ.94 కోట్లు(23.8%) వ్యయం చేశారు. 91.3% మంది ఎంపీలు పేలవమైన పనితీరు కనపరిచారని, 4.3% మంది అసలు పనులే చేయలేదని వెల్లడైంది. ఏపీ ఎంపీలకు రూ.554 కోట్లు కేటాయించగా రూ.127కోట్లు (23ు)ఖర్చు చేశారు. ఏపీలోని బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ తనకు కేటాయించిన రూ.14 కోట్లలో ఒక్క పైసా ఖర్చు చేయలేదు. కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీకి 7కోట్లు కేటాయించినా ఒక్క పైసా ఖర్చు చేయలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!