

ఆసియాకప్ జూనియర్ హాకీ టోర్నీలో భారత అమ్మాయిల జట్టు అదరగొట్టింది. క్వార్టర్‌ఫైనల్లో పాకిస్థాన్‌ను ఏకంగా 19-0తో చిత్తు చేసి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మ్యాచ్ ప్రారంభం నుంచే భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించగా.. పాక్ జట్టు ప్రేక్షక పాత్రకే పరిమితమైంది. తొలి క్వార్టర్‌లోనే ఐదు గోల్స్ చేసిన భారత్.. చివరి వరకు అదే జోరును కొనసాగించింది. మ్యాచ్‌లో మొత్తం 18 పెనాల్టీ కార్నర్‌లు సాధించడంతో పాటు ఒక పెనాల్టీ స్ట్రోక్‌ను కూడా భారత్ దక్కించుకుంది.
మ్యాచ్ ఏడో నిమిషంలో పూజ సాహూ గోల్‌తో భారత్ ఖాతా తెరిచింది. ఆ తర్వాత గోల్స్ వరుస కొనసాగింది. తొలి రెండు క్వార్టర్లలో ఐదేసి గోల్స్ చేసిన భారత జట్టు.. మూడో క్వార్టర్‌లో మూడు, చివరి క్వార్టర్‌లో ఏకంగా ఆరు గోల్స్ చేసింది. పూజ మలిక్ మూడు గోల్స్‌తో మెరిసింది. రోషిణి, సనిక, మధు, సుప్రియ రెండేసి గోల్స్ సాధించారు. తనుశ్రీ, సుఖ్‌వీర్, గీత, టొప్పొ తనుజ, పూర్ణిమ, కృష్ణశర్మ, బినిమా ధన్ ఒక్కో గోల్ చేశారు. తదుపరి సెమీఫైనల్లో కొరియా, మలేసియా మధ్య క్వార్టర్‌ఫైనల్ విజేతతో భారత్ తలపడనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!