

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉమ్మడి వరంగల్ పర్యటనలో మంత్రి కొండా సురేఖ గైర్హాజరు కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఆదివారం మూడు జిల్లాల్లో సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ, ఏ వేదికపైనా సురేఖ కనిపించలేదు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఆమె లేకుండానే సీఎం మేడారం అభివృద్ధి పనులను పరిశీలించడం ఆసక్తికరంగా మారింది. దీంతో కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాల కారణంగానే ఆమె పర్యటనకు దూరంగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది.
పరకాలలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు కూడా సురేఖ హాజరు కాలేదు. ఈ సభలో వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి రేవూరి ప్రకాశ్‌రెడ్డి పోటీ చేస్తారని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అయితే, సురేఖ కుమార్తె సుస్మిత గతంలో పరకాల నుంచి పోటీ చేయాలనే ఆసక్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో సీఎం పర్యటనకు సురేఖ దూరంగా ఉండటానికి రాజకీయ విభేదాలే కారణమా అనే చర్చ మొదలైంది. అయితే దీనిపై మంత్రి సురేఖ లేదా కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారికంగా ఎలాంటి స్పష్టత రాలేదు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!