

విడుదల తేదీ: జూలై 10, 2026
నటీనటులు: పృథ్వీరాజ్ సుకుమారన్, పార్వతి తిరువోతు, హక్కీమ్ షాజహాన్, అశోకన్, ఐరా తదితరులు
దర్శకుడు: నిసామ్ బషీర్
నిర్మాతలు: సుప్రియా మీనన్, ముకేశ్ ఆర్. మెహతా, సీవీ శరత్
సంగీత దర్శకుడు: జేక్స్ బిజోయ్
సినిమాటోగ్రాఫర్: దినేష్ పురుషోత్తమన్
ఎడిటర్: రమీస్ ఎం.బి
ప్రభుత్వ ఉద్యోగి రాజీవ్ (పృథ్వీరాజ్ సుకుమారన్) తన భార్య మీరా (పార్వతి తిరువోతు), ఇద్దరు కుమార్తెలతో ప్రశాంత జీవితం గడుపుతుంటాడు. ఒక రోజు రూ.17 కోట్ల బ్యాంక్ దోపిడీకి పాల్పడిన ముగ్గురు దొంగలు అతడిని బందీగా తీసుకెళ్తారు. పారిపోతున్న క్రమంలో వారు మరణించడంతో, దోపిడీ డబ్బు ఎక్కడుందో రాజీవ్‌కే తెలుసన్న అనుమానం అందరిలో మొదలవుతుంది. రాజీవ్ నిజంగా ఈ నేరంలో భాగస్వామేనా? లేక కుట్రకు బలయ్యాడా? ఆ మిస్సింగ్ డబ్బు వెనుక అసలు నిజం ఏమిటి? అనేదే మిగతా కథ.
సినిమా డబ్బు కంటే మనశ్శాంతి, కుటుంబ సంతోషమే గొప్పదనే సందేశాన్ని హృద్యంగా చెబుతుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ మరోసారి తన అద్భుత నటనతో సినిమాను ముందుకు నడిపించారు. కుటుంబంతో కూడిన భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన నటన ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. పార్వతి తిరువోతు తన పాత్రలో హుందాగా నటించగా, అశోకన్, హక్కీమ్ షాజహాన్ తమ పాత్రలకు న్యాయం చేశారు. రెండో భాగం ప్రారంభం వరకు కథనం ఆసక్తికరంగా సాగుతుంది. జేక్స్ బిజోయ్ అందించిన నేపథ్య సంగీతం చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది.
ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా సాగడం, కొన్ని సన్నివేశాలు అనవసరంగా పొడిగించడం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. రెండో భాగం ప్రారంభంలో ఆసక్తి పెరిగినా, తర్వాత కథనం బలహీనపడుతుంది. ప్రీ-క్లైమాక్స్‌లో ముఖ్యమంత్రి ఎపిసోడ్ సహజంగా అనిపించదు. ఓపెన్ ఎండింగ్‌తో ముగిసే క్లైమాక్స్ ప్రేక్షకులకు పూర్తి సంతృప్తిని ఇవ్వదు. మరింత పదునైన స్క్రీన్‌ప్లే, తక్కువ నిడివి ఉంటే సినిమా మరింత ప్రభావవంతంగా ఉండేది.
దర్శకుడు నిసామ్ బషీర్ ఆసక్తికరమైన కథాంశాన్ని ఎంచుకున్నప్పటికీ, కథనంలో మరింత బిగుతు ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ సినిమా మూడ్‌కు తగ్గట్టుగా ఉంది. రమీస్ ఎం.బి ఎడిటింగ్ మరింత షార్ప్‌గా ఉండి ఉంటే బాగుండేది. జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం సినిమాకు అదనపు బలం అందించింది. నిర్మాణ విలువలు, యాక్షన్ కొరియోగ్రఫీ మెప్పిస్తాయి. తెలుగు డబ్బింగ్ బాగున్నప్పటికీ టైటిల్స్, కొన్ని బోర్డుల అనువాదంలో మరింత శ్రద్ధ తీసుకుని ఉంటే ఇంకా మెరుగ్గా ఉండేది.
'ఐ, నోబడీ' మంచి ఆలోచనతో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్. పృథ్వీరాజ్ సుకుమారన్ అద్భుత నటన, జేక్స్ బిజోయ్ సంగీతం సినిమాను నిలబెట్టాయి. అయితే నెమ్మదిగా సాగే కథనం, బలహీనమైన ప్రీ-క్లైమాక్స్, సందిగ్ధ ముగింపు కారణంగా సినిమా పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. నెమ్మదిగా సాగే థ్రిల్లర్లను ఇష్టపడే ప్రేక్షకులు ఒకసారి చూడవచ్చు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!