

బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2లో టాప్ 15 ఎంపిక ప్రక్రియ ఆరో ఎపిసోడ్లో మరింత ఆసక్తికరంగా సాగింది. ఇప్పటికే రాజకుమారి, మిథిలేశ్, చరణ్ నేరుగా టాప్ 15లోకి వెళ్లగా, తాజా ఎపిసోడ్లో నిర్వహించిన డేర్ ఆర్ డై టాస్కుల ద్వారా మరో నలుగురు కంటెస్టెంట్లు తమ స్థానాలను ఖరారు చేసుకున్నారు. దీంతో టాప్ 15లో ఇప్పటివరకు ఏడు స్థానాలు భర్తీ అయ్యాయి.
మొదటి టాస్కులో షాలిని, అమన్ పోటీ పడగా, కుళ్లిన కూరగాయలతో నిర్వహించిన ఛాలెంజ్‌లో షాలిని విజయం సాధించింది. దీంతో ఆమె టాప్ 15లోకి వెళ్లింది. రెండో టాస్కులో మాజీ ప్రేమికులకు ఫోన్ చేసి సారీ చెప్పడంతో పాటు, మళ్లీ జీవితంలోకి రావాలని కోరాల్సి వచ్చింది. పలువురు ప్రయత్నించినా వారి మాజీలు ఫోన్ ఎత్తలేదు. చివరకు శ్రష్టికి అవకాశం దక్కింది. ఆమె తన మాజీ ప్రియుడికి ఫోన్ చేసి, జరిగిన తప్పుకు క్షమాపణలు చెప్పడంతో పాటు తాను నిజంగానే ప్రేమించానని భావోద్వేగంగా మాట్లాడింది. ఈ నిర్ణయాన్ని శ్రీముఖి, అభిజిత్, బిందు మాధవి, నవదీప్ ప్రశంసించడంతో ఆమెకు టాప్ 15 బెర్త్ దక్కింది.
మూడో టాస్కులో నుదుటిపై “తూ నా బతుకు” లేదా “ఐ యామ్ ఏ లూజర్” వంటి టాటూ వేయించుకోవాల్సి వచ్చింది. వెనక్కి తగ్గకుండా సవాల్‌ను స్వీకరించిన కృష్ణ టాప్ 15లో స్థానం సంపాదించాడు. అనంతరం హెయిర్ కట్ టాస్కులో భాగి ముందుకు వచ్చి చిన్న హెయిర్ కట్ చేయించుకుంది. దీంతో ఆమె కూడా టాప్ 15లోకి వెళ్లింది.
చివరగా హేమంత్, వెంకటేష్ మధ్య ఆసక్తికరమైన పోటీ జరిగింది. ఇద్దరూ ఎగ్జిట్ కార్డులు ఎంచుకోవడంతో వారికి బురద టాస్క్ ఇచ్చారు. గ్రీన్ కార్డ్ దొరికితే హోల్డ్‌లో కొనసాగుతారని, ఓడిన వ్యక్తి ఎలిమినేట్ అవుతారని తెలిపారు. చివరకు హేమంత్ గ్రీన్ కార్డ్ సాధించగా, వెంకటేష్ ఓడిపోయి షో నుంచి బయటకు వెళ్లాడు. ఎపిసోడ్ ముగిసే సమయానికి టాప్ 15లో ఏడుగురు, హోల్డ్‌లో 13 మంది మిగిలారు. తదుపరి ఎపిసోడ్లో మిగిలిన స్థానాలను భర్తీ చేయనున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!