

భారత్‌తో జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాటర్లు విశ్వరూపం చూపించారు. గ్లెన్ ఫిలిప్స్ విధ్వంసకర సెంచరీతో చెలరేగడంతో కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 259 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో టీమిండియా ముందు 260 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఫిలిప్స్ కేవలం 49 బంతుల్లోనే 6 ఫోర్లు, 10 సిక్సర్లతో 107 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మైఖేల్ బ్రేస్‌వెల్ 61 పరుగులతో అర్ధశతకం సాధించగా, ఫిన్ అలెన్ 31, డారెల్ మిచెల్ 24 పరుగులతో రాణించారు. మరోవైపు టిమ్ సీఫెర్ట్ కేవలం 3 పరుగులకే వెనుదిరిగాడు.
భారత బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ మయాంక్ యాదవ్ మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. అక్షర్ పటేల్, ప్రిన్స్ యాదవ్, అర్షదీప్ సింగ్, నితీశ్ కుమార్ తలో వికెట్ పడగొట్టారు. మిచెల్ శాంట్నర్‌ను ఔట్ చేయడం ద్వారా అర్షదీప్ సింగ్ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో తన 150వ వికెట్‌ను పూర్తి చేసుకున్నాడు. అయితే భారత బౌలర్లలో నితీశ్ కుమార్ అత్యధికంగా 64 పరుగులు సమర్పించుకున్నాడు. ముఖ్యంగా 16వ ఓవర్‌లో 32 పరుగులు ఇచ్చాడు. ప్రిన్స్ యాదవ్ 49, మయాంక్ యాదవ్ 48, అక్షర్ పటేల్ 43, అర్షదీప్ సింగ్ 38 పరుగులు ఇచ్చారు. భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా బ్యాటర్లు ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!