

గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లు చరిత్రాత్మక ప్రదర్శన చేశారు. ఎన్నడూ లేని విధంగా ఏకంగా ఏడు స్వర్ణ పతకాలను సాధించారు. ఈ విజేతల్లో 51 కేజీల విభాగంలో ఛాంపియన్‌గా నిలిచిన భారత బాక్సర్ సాక్షి చౌదరి కూడా ఉన్నారు. తన స్వర్ణ పతకం వెనుక క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లి మద్దతు ఉందని సాక్షి వెల్లడించారు. చాలా కాలంగా కోహ్లి తనకు స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నారని, తన ప్రయాణంలో ఎంతో అండగా నిలిచారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
తాను ఏదో ఒక రోజు అంతర్జాతీయ స్థాయిలో స్వర్ణ పతకం సాధిస్తానని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎంతో నమ్మకం పెట్టుకున్నారని సాక్షి చెప్పారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్లాస్గోలో స్వర్ణం సాధించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తన విజయం అనంతరం భారత జాతీయ గీతం వినిపిస్తుండగా త్రివర్ణ పతాకం పైకి ఎగరడం చూసిన క్షణం జీవితంలోనే అత్యంత గర్వించదగ్గ సందర్భమని సాక్షి పేర్కొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!