

సైబర్ నేరాలు దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన ముప్పుగా మారుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర హోంశాఖ గణాంకాల ప్రకారం, 2025లో భారత్ సైబర్ మోసాల కారణంగా రూ.22,495 కోట్లు కోల్పోగా, 2024లో ఈ నష్టం రూ.22,845 కోట్లకు చేరింది. యూపీఐ లావాదేవీలు, డిజిటల్ సేవల విస్తరణతో పాటు డిజిటల్ అరెస్ట్, పెట్టుబడి మోసాలు, డీప్‌ఫేక్ ఆధారిత మోసాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. మయన్మార్, లావోస్, థాయ్‌లాండ్, కంబోడియా సరిహద్దుల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ సైబర్ ముఠాలు భారతీయులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.
డిజిటల్ ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకు సైబర్ భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర సంస్థల మధ్య రియల్‌టైమ్ సమన్వయం, పాఠశాలల నుంచి ఉద్యోగ శిక్షణ వరకు సైబర్ అవగాహనను విస్తరించడం, సైబర్ ఫోరెన్సిక్ నిపుణుల సంఖ్య పెంచడం, కృత్రిమ మేధస్సు ఆధారిత ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు అభివృద్ధి చేయడం, అంతర్జాతీయ స్థాయిలో నేరస్థులపై కఠిన చర్యలకు దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం అవసరమని సూచించారు. డిజిటల్ ఇండియా లక్ష్యాలను విజయవంతంగా కొనసాగించాలంటే సైబర్ భద్రతను జాతీయ ప్రాధాన్యంగా చూడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!