

బైట్‌డ్యాన్స్ వ్యవస్థాపకుడు, టిక్‌టాక్ మాతృసంస్థ అధినేత ఝాంగ్ యిమింగ్ ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, 43 ఏళ్ల యిమింగ్ నికర సంపద 105 బిలియన్ డాలర్లను దాటింది. దీంతో భారత పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీని అధిగమించి ఆసియా సంపన్నుల జాబితాలో తొలి స్థానానికి చేరుకున్నారు. 2019 మార్చిలో బ్లూమ్‌బెర్గ్ యిమింగ్ సంపదను 13 బిలియన్ డాలర్లుగా అంచనా వేయగా, ప్రస్తుతం అది ఎనిమిది రెట్లకు పైగా పెరిగింది.
బైట్‌డ్యాన్స్ కేవలం టిక్‌టాక్ వంటి షార్ట్ వీడియో వేదికలకే పరిమితం కాకుండా కృత్రిమ మేధ రంగంలోకి విస్తరించడం యిమింగ్ సంపద పెరుగుదలకు కీలకంగా మారింది. సంస్థ అభివృద్ధి చేసిన దౌబావో ఏఐ చాట్‌బాట్, సీడాన్స్ వీడియో జనరేషన్ టూల్ వంటి ఉత్పత్తులు టెక్నాలజీ రంగంలో బైట్‌డ్యాన్స్ స్థాయిని పెంచాయి. తాజా పరిణామం ఆసియాలో సాంప్రదాయ పారిశ్రామిక రంగాలతో పాటు ఏఐ, టెక్నాలజీ ఆధారిత వ్యాపారాలు భారీ సంపదను సృష్టిస్తున్న తీరును సూచిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!