

యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ ఛార్జీల వల్ల వ్యాపారులు, వినియోగదారులపై భారం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. డిజిటల్ పేమెంట్ సంస్థల ప్రతినిధులు మాత్రం ఈ విధానం యూపీఐ వ్యవస్థను మరింత సుస్థిరంగా మార్చేందుకు ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
మోబిక్విక్ సహ వ్యవస్థాపకురాలు ఉపాసన టాకు మాట్లాడుతూ.. యూపీఐ లావాదేవీలు పెరుగుతున్న కొద్దీ పేమెంట్ మౌలిక సదుపాయాల నిర్వహణ ఖర్చులు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. ఎండీఆర్ ద్వారా బ్యాంకులు, పేమెంట్ సంస్థలపై ఉన్న ఆర్థిక భారం కొంత తగ్గి, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఫోన్‌పే వ్యవస్థాపకుడు, సీఈఓ సమీర్ నిగమ్ కూడా ఎండీఆర్‌కు మద్దతు తెలిపారు. వచ్చే ఆదాయాన్ని మౌలిక సదుపాయాల నిర్వహణ, యూపీఐ విస్తరణకు ఉపయోగించవచ్చని చెప్పారు.
అయితే కొత్త విధానం వల్ల సాధారణ వినియోగదారులు నేరుగా ఎలాంటి ఎండీఆర్ చెల్లించాల్సిన అవసరం లేదు. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే అన్ని యూపీఐ లావాదేవీలు ఉచితంగానే కొనసాగుతాయి. వ్యాపారులకు చేసే రూ.2,000 వరకు లావాదేవీలపై కూడా ఎండీఆర్ ఉండదు. రూ.2,000కు మించిన ఎంపిక చేసిన వ్యాపారి లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ వర్తిస్తుంది. రూ.75,000 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలకు గరిష్ఠంగా రూ.300 వరకు మాత్రమే ఎండీఆర్ ఉంటుంది. ఈ కొత్త విధానం అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!