

ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన రీచార్జ్ ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయి. టెలికాం వినియోగదారుల పరిరక్షణ నిబంధనల్లో తాజా మార్పుల ప్రకారం 30 రోజుల వ్యాలిడిటీతో పాటు అంతకంటే తక్కువ వ్యవధి ఉన్న వాయిస్, ఎస్ఎంఎస్ మాత్రమే అందించే ప్రత్యేక రీచార్జ్ ప్లాన్లకు అవకాశం కల్పించారు. వినియోగదారుల అవసరాలు, బడ్జెట్‌కు అనుగుణంగా మరిన్ని ఎంపికలు అందించడమే ఈ మార్పుల లక్ష్యంగా ఉంది.
టెలికాం వినియోగదారుల పరిరక్షణ పదమూడో సవరణ నిబంధనలు 2026ను ట్రాయ్ సెప్టెంబర్ 22న విడుదల చేసింది. కొత్త నిబంధనల ప్రకారం టెలికాం సంస్థలు వాయిస్, ఎస్ఎంఎస్, డేటా కలిపిన ప్లాన్లకు అనుగుణంగా వాయిస్, ఎస్ఎంఎస్ మాత్రమే అందించే ప్రత్యేక రీచార్జ్ ప్లాన్లను కూడా అందించాలి. ఇందులో 30 రోజులు లేదా అంతకంటే తక్కువ వ్యాలిడిటీ ఉన్న ఆప్షన్లతో పాటు, ప్రతి నెల ఒకే తేదీన పునరుద్ధరించుకునే సదుపాయం ఉన్న ప్లాన్ కూడా ఉంటుంది.
ఈ మార్పులను రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా స్వాగతించారు. 28 రోజుల రీచార్జ్ వ్యవధి కారణంగా నెలవారీ ప్లాన్ పేరుతో ఏడాదిలో 13 సార్లు రీచార్జ్ చేయాల్సి వస్తోందని ఆయన గతంలో పార్లమెంట్లో ప్రస్తావించారు. తాజా నిబంధనలతో 30 రోజుల ప్లాన్‌ను ఎంచుకునే వినియోగదారులకు ఏడాదిలో రీచార్జ్‌ల సంఖ్య 12కు తగ్గే అవకాశం ఉంది. డేటా అవసరం లేకుండా ప్రధానంగా కాల్స్, ఎస్ఎంఎస్ కోసం ఫోన్ ఉపయోగించే వారికి కూడా ప్రత్యేక ప్లాన్లు అందుబాటులోకి రానున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!