

బీహార్ రాజధాని పాట్నాలో విద్యార్థుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు పెద్ద సంఖ్యలో రోడ్డెక్కారు. ఈ క్రమంలో సీఎం నివాసం వైపు భారీ ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.
సీఎం నివాసం వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు వాటర్ కెనాన్లతో చెదరగొట్టారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనలో పాల్గొన్న కొందరు విద్యార్థులు పోలీసులపైకి రాళ్లు రువ్వినట్లు సమాచారం. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు భారీగా బలగాలను మోహరించారు.
సీఎం నివాసం చుట్టుపక్కల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సీఆర్‌పీఎఫ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌కు చెందిన బలగాలను కూడా రంగంలోకి దించారు. విద్యార్థులు భద్రతా వలయాన్ని దాటి సీఎం నివాసం వైపు వెళ్లకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.
బీపీఎస్సీ పరీక్ష రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. పోటీ పరీక్షలకు సంబంధించిన సమస్యలు, తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలని విద్యార్థులు కోరుతున్నారు. మరోవైపు పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!