

వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను ఎవరూ ఆషామాషీగా తీసుకోవద్దని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు. స్థానిక ఎన్నికలపై నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవి కేవలం గెలుపోటములకు సంబంధించిన ఎన్నికలు కాదని, పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడాల్సిన ఎన్నికలని స్పష్టం చేశారు.
అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడినా పార్టీ నాయకత్వం తమతోనే ఉందనే భరోసా ప్రతి కార్యకర్తకు కలగాలని జగన్ అన్నారు. స్థానిక స్థాయిలో పార్టీ బలోపేతానికి కార్యకర్తల పాత్ర కీలకమని, అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించినట్లు తెలిపారు.
తమ ప్రభుత్వ హయాంలో మేనిఫెస్టోకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని జగన్ పేర్కొన్నారు. మేనిఫెస్టోను ఖురాన్, బైబిల్, భగవద్గీతగా భావించామని, అందులో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశామని ఆయన తెలిపారు. మేనిఫెస్టోను కేవలం ఎన్నికల సమయంలో విడుదల చేసే పత్రంగా కాకుండా, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు మార్గదర్శకంగా భావించామని చెప్పారు.
సంక్షేమ పథకాల అమలులో భాగంగా సంక్షేమ క్యాలెండర్‌ను ప్రకటించి, చెప్పిన నెలలోనే ఆయా పథకాలను అమలు చేశామని జగన్ వివరించారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేయకుండా ప్రతి హామీని అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నామని అన్నారు.
ప్రతి 50 నుంచి 60 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమించి సంక్షేమ పథకాలను ప్రజల ఇంటి గడపకే చేర్చామని జగన్ పేర్కొన్నారు. లంచాలు, వివక్షకు తావులేకుండా ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి అందేలా వాలంటీర్ వ్యవస్థ పనిచేసిందని ఆయన తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేసి ప్రజల్లోకి వెళ్లాలని జగన్ సూచించినట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!