

అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీఆర్‌ఎస్‌కు రూ.495.52 కోట్లు అందాయి. ప్రాంతీయ రాజకీయ పార్టీల్లో తృణమూల్ కాంగ్రెస్ తర్వాత అత్యధిక నిధులు అందుకున్న పార్టీగా బీఆర్‌ఎస్ నిలిచింది. తృణమూల్ కాంగ్రెస్‌కు రూ.612 కోట్లు, బిజూ జనతాదళ్‌కు రూ.245 కోట్లు, టీడీపీకి రూ.174 కోట్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రూ.121 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా లభించినట్లు నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా 40 ప్రాంతీయ పార్టీలకు 2023-24లో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా మొత్తం రూ.1,820.02 కోట్లు అందినట్లు ఏడీఆర్ పేర్కొంది.
2024 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించిన అనంతరం రాజకీయ విరాళాల సరళిలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. 2023-24లో రూ.20 వేలకుపైగా నమోదైన విరాళాలు రూ.347.69 కోట్లు ఉండగా, 2024-25లో అవి ఏకంగా రూ.1,051 కోట్లకు చేరాయి. 2024-25లో డీఎంకే రూ.365.78 కోట్ల విరాళాలతో అగ్రస్థానంలో నిలవగా, బీఆర్‌ఎస్ విరాళాలు భారీగా తగ్గాయి. 2023-24లో రూ.85 కోట్లు ప్రకటించిన బీఆర్‌ఎస్, 2024-25లో కేవలం రూ.15 కోట్లు మాత్రమే స్వీకరించినట్లు నివేదిక వెల్లడించింది. ఇది 82 శాతానికి పైగా తగ్గుదలను సూచిస్తుందని ఏడీఆర్ పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!