

దేశంలో వర్షపు నీటిని సంరక్షించడం, భూగర్భ జలాల మట్టాన్ని పెంపొందించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 'క్యాచ్ ది రైన్–2026' జాతీయ ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించింది. జూలై 4 నుంచి ఆగస్టు 4, 2026 వరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం "ప్రతి వానచుక్కను కాపాడుకుందాం – ప్రతి రేపటిని భద్రపరుచుకుందాం" అనే సందేశంతో సాగుతోంది. ప్రతి ఇల్లు, అపార్ట్‌మెంట్, కార్యాలయం, విద్యాసంస్థలో రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయడం, రీఛార్జ్ పిట్స్, రీఛార్జ్ షాఫ్ట్‌లు నిర్మించడం, ఉపయోగంలో లేని బోర్‌వెల్‌లను భూగర్భ జలాల రీఛార్జ్‌కు వినియోగించాలని కేంద్రం సూచించింది.
అదేవిధంగా పురాతన బావులు, బావిళ్లు, చెరువులు, కుంటలు వంటి సంప్రదాయ జల వనరులను పునరుద్ధరించడం, రిజర్వాయర్లలో పూడిక తొలగించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం, విస్తృతంగా వృక్షారోపణ చేపట్టడం వంటి చర్యలను ప్రోత్సహిస్తోంది. పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలు, మహిళా సంఘాలు, యువత, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని కేంద్రం కోరింది. అలాగే 'జల్ సంచయ్ జన భాగిదారి 2.0' కార్యక్రమం కింద ఇప్పటికే 1.5 కోట్లకు పైగా భూగర్భ జలాల రీఛార్జ్ నిర్మాణాలు పూర్తయ్యాయని, ఇది నిర్దేశిత లక్ష్యాన్ని 50 శాతానికి పైగా అధిగమించిన విజయమని వెల్లడించింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!