

ఆంధ్రప్రదేశ్‌లో చేపడుతున్న భారీ రైల్వే ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు రైల్వేశాఖ పరిధిలోని కీలక సంస్థల ప్రాంతీయ, ఏరియా, ప్రాజెక్టు అమలు కార్యాలయాలను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కోరుతోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల రైల్వే బోర్డు ఛైర్మన్‌కు లేఖ రాశారు. రైట్స్, కాంకర్, ఆర్వీఎన్‌ఎల్, ఆర్‌ఎల్‌డీఏ, రైల్‌టెల్, ఐఆర్‌సీటీసీ, డీఎఫ్‌సీసీఐఎల్, ఐఆర్‌ఎఫ్‌సీ వంటి సంస్థల కార్యాలయాలు రాష్ట్రంలో ఉంటే రైల్వే ప్రాజెక్టుల రూపకల్పన, డీపీఆర్‌ల తయారీ, నిర్మాణం, నిర్వహణ, లాజిస్టిక్స్, ప్రయాణికుల సదుపాయాలు, నిధుల సమీకరణ వంటి అంశాల్లో సమన్వయం మెరుగుపడి పనులు వేగవంతమవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఈ కార్యాలయాల అవసరం మరింత పెరిగిందని ప్రభుత్వం పేర్కొంటోంది. విశాఖపట్నంతో పాటు విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్ల పరిధిలో రూ.58,530 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉండగా, మరో రూ.51 వేల కోట్ల ప్రాజెక్టులు డీపీఆర్ దశలో, రూ.20,740 కోట్ల ప్రాజెక్టులు సర్వే దశలో ఉన్నాయి. రాష్ట్రం మీదుగా ప్రతిపాదించిన హైస్పీడ్ రైల్ కారిడార్ల అంచనా విలువ సుమారు రూ.1.90 లక్షల కోట్లుగా ఉంది. ఈ భారీ ప్రాజెక్టుల నేపథ్యంలో కాంకర్, ఆర్వీఎన్‌ఎల్, రైల్‌టెల్, ఆర్‌ఎల్‌డీఏ, రైట్స్, ఐఆర్‌సీటీసీ, డీఎఫ్‌సీసీఐఎల్, ఐఆర్‌ఎఫ్‌సీ కార్యాలయాలను ఏపీలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!