

ప్రజాకవి, తెలంగాణ వైతాళికుడు, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆయనకు ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ సమాజం, ప్రజల హక్కులు, సామాజిక న్యాయం కోసం కాళోజీ చేసిన పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు. తన సాహిత్యం ద్వారా ప్రజల సమస్యలు, సామాజిక అసమానతలు, పాలకుల వైఖరిని ప్రశ్నిస్తూ కాళోజీ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని అన్నారు. ‘నా గొడవ’ వంటి రచనలతో ఆయన సామాన్యుడి గొంతుకగా నిలిచారని గుర్తుచేశారు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంతో పాటు ప్రజాస్వామ్య విలువలు, మానవ హక్కులు, సామాజిక న్యాయం కోసం కాళోజీ జీవితాంతం పోరాడారని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. తెలంగాణ ప్రజల జీవన విధానం, యాస, భాష, సంస్కృతి ఆయన రచనల్లో ప్రతిబింబించాయని అన్నారు. అన్యాయాన్ని ప్రశ్నించడం, అణగారిన వర్గాల తరఫున నిలబడటం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం వంటి కాళోజీ ఆశయాలను నేటి తరం ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం ఆయనకు దక్కిన అరుదైన గౌరవమని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!