

చెన్నై పట్టినపాక్కంలోని శీనివాసపురం వద్ద ప్రతిపాదించిన కొత్త అసెంబ్లీ-సచివాలయ సముదాయ నిర్మాణానికి పరిసర ప్రాంతాల్లోని మత్స్యకార గ్రామాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. శీనివాసపురం, ముళ్లికుప్పం, ముళ్లిమానగర్, రాజీవ్‌గాంధీ నగర్, నంబిక్కై నగర్, భవాని కుప్పం, డుమింగ్ కుప్పం, ఇరుదయరాజపురం, సెల్వరాజ్పురం, నొచ్చినగర్, నొచ్చికుప్పం తదితర ప్రాంతాల ప్రజలు ప్రాజెక్టుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపాదిత స్థలంతో తమ మత్స్యకార సమాజానికి తరతరాలుగా సంబంధం ఉందని వారు చెబుతున్నారు. అక్కడ సచివాలయం నిర్మిస్తే సముద్రానికి చేరుకునే మార్గాలు, చేపల వేటకు సంబంధించిన కార్యకలాపాలు, తమ జీవనోపాధిపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మత్స్యకార సంఘాలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి.
భారీ ప్రాజెక్టు చేపట్టే ముందు స్థానిక ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం తీసుకోలేదని మత్స్యకార సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే తమ ప్రాంతాల్లోని పలు ఇళ్లు శిథిలావస్థకు చేరాయని, సురక్షితమైన ప్రత్యామ్నాయ నివాసాల కోసం ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నామని వారు చెబుతున్నారు. సచివాలయం నిర్మాణంతో భద్రతా కారణాల వల్ల తీర ప్రాంతంలో రాకపోకలపై ఆంక్షలు పెరిగితే చేపల వేట, వలలు ఆరబెట్టడం, పడవల నిర్వహణ వంటి కార్యకలాపాలకు ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పోరాటానికి ఇతర మత్స్యకార గ్రామాల నుంచి కూడా మద్దతు లభిస్తోందని సంఘాల ప్రతినిధులు తెలిపారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!