

తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యమివ్వనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్‌లో మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఏర్పాట్లపై చర్చించారు. వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొనే ఈ జాతీయస్థాయి పోటీలకు అవసరమైన మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. హైదరాబాద్‌లోని ప్రస్తుత స్టేడియంల పరిస్థితిని పరిశీలించి, క్రీడా పోటీలకు అనుగుణంగా వాటిని శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని, ఇందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం సమకూరుస్తుందని స్పష్టం చేశారు.
ప్రారంభ, ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథులు, ప్రముఖ క్రీడాకారులు, సినీ ప్రముఖులను భాగస్వాములను చేసేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు. మౌలిక వసతులు, క్రీడల నిర్వహణ, అతిథులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు సంబంధించి పని విభజన చేసుకుని బాధ్యతలు అప్పగించాలని తెలిపారు. తెలంగాణకు చెందిన అర్జున అవార్డు గ్రహీతలు, తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు సభ్యులు, ఒలింపిక్స్ అసోసియేషన్, జాతీయస్థాయి క్రీడా ప్రతినిధులను భాగస్వాములను చేయాలని సూచించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో భాగంగా 20 రకాల క్రీడల్లో పోటీలు జరగనున్న నేపథ్యంలో క్రీడల వారీగా వేదికలను గుర్తించి ఏర్పాట్లు చేయాలని, క్రీడా స్ఫూర్తిని ప్రతిబింబించేలా నిర్వహణ ఉండాలని ఆదేశించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!