

కాళేశ్వరం ప్రాజెక్టు, తెలంగాణ నీటి నిర్వహణపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం మొత్తం కుప్పకూలిందని, ప్రాజెక్టు పనికిరాదని కాంగ్రెస్ చేసిన ప్రచారం ఒక్కొక్కటిగా తప్పని తేలుతోందని అన్నారు.
NDSA సమర్పించిన అఫిడవిట్‌లో అవసరాన్ని బట్టి కాళేశ్వరం నుంచి నీటిని లిఫ్ట్ చేసుకోవచ్చని స్పష్టం చేసిందని హరీశ్ రావు పేర్కొన్నారు. అలాగే CWPRS పరిశీలనలో అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో ఏ బ్లాక్‌లోనూ నిర్మాణపరమైన సమస్యలు గుర్తించలేదని, కాంక్రీట్ నాణ్యత కూడా బాగుందని వెల్లడైందని తెలిపారు.
రాజకీయ కారణాలతో కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన పెట్టి, తెలంగాణకు వచ్చిన గోదావరి నీటిని వినియోగించుకోకుండా కిందికి వదిలేస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. ప్రతిపక్షాలు ప్రశ్నించిన తర్వాతే దేవాదుల, నంది పంపులను ఆలస్యంగా ఆన్ చేశారని, అప్పటికే వరద నీటిలో చాలా భాగం కిందికి వెళ్లిపోయిందని అన్నారు.
తెలంగాణలో జలాశయాల నీటి నిల్వలు తక్కువగా ఉండటంపై కూడా హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయ కక్షలకు ప్రాధాన్యం ఇవ్వకుండా నీటి నిర్వహణ, రాష్ట్ర నీటి హక్కులు, రైతుల ప్రయోజనాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు.
కాళేశ్వరంపై దుష్ప్రచారం మానేసి అన్నారం, సుందిళ్ల మోటార్లను వెంటనే ఆన్ చేసి గోదావరి నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లను నింపాలని, రైతుల పొలాలకు నీరు అందించాలని బీఆర్‌ఎస్ తరఫున హరీశ్ రావు డిమాండ్ చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!