

రాష్ట్రంలో 22ఎ నిషేధిత భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, జిల్లా రిజిస్ట్రార్లు, సబ్‌రిజిస్ట్రార్లతో సచివాలయంలో నిర్వహించిన సమీక్ష అనంతరం మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. కమిటీ ప్రతి వారం సమావేశమై పెండింగ్ దరఖాస్తులు, ఇతర సమస్యలను పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో 511 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, రాష్ట్రవ్యాప్తంగా 22ఎ దరఖాస్తులను ఈ నెలాఖరులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
నిషేధిత భూములకు సంబంధించిన సమాచారం, సమస్యల పరిష్కారం కోసం 1800 5994788 టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. సమాచారం అందించిన వారికి మూడు రోజుల్లోగా స్పందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రిజిస్ట్రేషన్‌కు అవకాశం లేని కేసుల్లో కారణాలను ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని, నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ ఫీజు తిరిగి చెల్లించాల్సిన సందర్భాల్లో ఆ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. భూదాన్ భూములు, వాటికి సంబంధించిన వివాదాలపై సమగ్ర నివేదిక రూపొందించనున్నట్లు తెలిపారు. యూఎల్‌సీ జాబితాలోని తప్పులను సరిచేస్తున్నామని, అసలైన హక్కుదారులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సర్వే శాఖ, జీహెచ్‌ఎంసీ రికార్డుల మధ్య ఉన్న వ్యత్యాసాలను కూడా పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. కొంత భూమి మాత్రమే నిషేధిత కేటగిరీలో ఉన్నప్పటికీ మొత్తం భూమిని 22ఎ జాబితాలో చేర్చిన సందర్భాలను గుర్తించి, జియో ట్యాగింగ్ ద్వారా అసలు నిషేధిత ప్రాంతాలను గుర్తించి మిగిలిన భూమిని ఫ్రీహోల్డ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!