

హైదరాబాద్ పరిధిలో అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో పేద, మధ్యతరగతి ప్రజలకు సొంత ఇల్లు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ‘ఇందిరమ్మ ఇండ్లు టవర్స్’ పథకానికి భారీ స్పందన లభిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం లక్ష ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా, పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రతి నియోజకవర్గంలో 500 ఇళ్ల చొప్పున నిర్మాణాలు చేపడుతోంది. ప్రస్తుతం 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న 7,340 ఇళ్ల కోసం డిమాండ్ సర్వే ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తుండగా, శనివారం నాటికి 35,125 దరఖాస్తులు వచ్చినట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వి.పీ. గౌతమ్ తెలిపారు. దరఖాస్తులకు ఈ నెల 10వ తేదీ వరకు అవకాశం ఉంది.
విలువైన ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఈ ఫ్లాట్లను మార్కెట్ ధరతో పోలిస్తే చాలా తక్కువ ధరకే ప్రభుత్వం అందిస్తోంది. బహిరంగ మార్కెట్‌లో రూ.30 లక్షల నుంచి రూ.58 లక్షల వరకు విలువ చేసే ఫ్లాట్లను ప్రజల సంక్షేమం, జీవన ప్రమాణాల మెరుగుదల లక్ష్యంగా కేవలం రూ.6 లక్షలకే కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇల్లు పొందిన లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ కూడా చేస్తామని వెల్లడించారు. ఎంపిక కాని దరఖాస్తుదారులకు వారు చెల్లించిన రూ.10,000 ధరావతు రుసుమును తిరిగి చెల్లిస్తామని స్పష్టం చేశారు. దరఖాస్తు గడువు ముగియడానికి మరో రెండు రోజులు మాత్రమే ఉండటంతో అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. సందేహాల నివృత్తికి 040-24603572 నంబర్‌లో సంప్రదించవచ్చు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!