

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు ఎన్నికైన తెలంగాణకు చెందిన ప్రముఖ ప్రవాస భారతీయుడు ఉదయ్ నాగరాజును ఘనంగా సత్కరించారు. దేశంలోని పలు రాష్ట్రాలు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమంలో కేటీఆర్ శాలువాతో సన్మానించి, ప్రత్యేక కరీంనగర్ ఫిలిగ్రీ మెమెంటోను అందజేశారు. ఈ సందర్భంగా ఉదయ్ నాగరాజుకు అభినందనలు తెలియజేసిన కేటీఆర్, భారత్-యునైటెడ్ కింగ్‌డమ్ సంబంధాల బలోపేతంలో ఆయన రెండు దశాబ్దాలుగా అందించిన సేవలను ప్రశంసించారు.
భవిష్యత్తులో తెలంగాణకు పెట్టుబడులు, వాణిజ్యం, సేవారంగం మరియు సాంకేతిక భాగస్వామ్యాలను మరింత విస్తరించడంలో ఉదయ్ నాగరాజు కీలక పాత్ర పోషించాలని కేటీఆర్ ఆకాంక్షించారు. స్పందించిన ఉదయ్ నాగరాజు, తెలంగాణ ఉద్యమం నుంచి కేటీఆర్ రాజకీయ ప్రస్థానం తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని అన్నారు. ఉన్నత విద్యావంతులు రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేస్తే సమాజంలో సానుకూల మార్పు సాధ్యమని కేటీఆర్ తన నాయకత్వంతో నిరూపించారని పేర్కొన్నారు. యూకే, భారత్‌లలో జరిగిన అనేక సమావేశాల్లో కేటీఆర్‌తో అభిప్రాయాలు పంచుకునే అవకాశం తనకు లభించిందని, ఆయన దూరదృష్టి తనను ప్రభావితం చేసిందని తెలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!