

మిగులు ధాన్యాన్ని ఈ-వేలం ద్వారా పారదర్శకంగా విక్రయించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని పౌరసరఫరాలశాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్, తెలంగాణ ఈ-ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్ వంటి ప్రభుత్వ వేదికలను ఇందుకోసం వినియోగించాలని సూచించారు. హైదరాబాద్‌లో పౌరసరఫరాల సంస్థ కార్యకలాపాలపై నిర్వహించిన సమీక్షలో ధాన్యం వేలానికి సంబంధించిన లాట్ల పరిమాణాలు, బిడ్డింగ్ నిబంధనలను పక్కాగా రూపొందించాలని అధికారులకు తెలిపారు.
రాష్ట్రంలో వరి ఉత్పత్తి, ధాన్యం కొనుగోళ్లు ఏటేటా పెరుగుతున్న నేపథ్యంలో సేకరించిన ధాన్యాన్ని సురక్షితంగా, శాస్త్రీయంగా నిల్వ చేసేందుకు వ్యూహాత్మక ప్రాంతాల్లో ఆధునిక నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. సంప్రదాయ గోదాములు భవిష్యత్ అవసరాలకు సరిపోవని, ఆటోమేటెడ్ హ్యాండ్లింగ్, శాస్త్రీయ సంరక్షణ, యాంత్రిక రవాణా, డిజిటల్ పర్యవేక్షణతో కూడిన ఆధునిక నిల్వ నెట్‌వర్క్ అవసరమని పేర్కొన్నారు. అదనంగా 5 నుంచి 10 లక్షల టన్నుల ధాన్యం నిల్వ సామర్థ్యాన్ని ఏర్పాటు చేసే ప్రణాళికలు రూపొందించాలని, నిర్మాణం, నిర్వహణలో మహిళా స్వయం సహాయక సంఘాలను భాగస్వాములను చేయాలని ఆదేశించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!