

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నకిరేపేట గ్రామంలో వన్యప్రాణుల వేట కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ ఉచ్చులో చిక్కుకుని చెరువుసింగారం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నవీన్ మృతి చెందడంపై అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వన్యప్రాణుల వేటకు పాల్పడుతున్న అనుమానితులను పట్టుకునేందుకు మరో ముగ్గురు బీట్ అధికారులతో కలిసి వెళ్లిన నవీన్ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు. జిల్లా డీఎఫ్‌ఓ సిద్ధార్థ విక్రమ్ సింగ్‌తో మాట్లాడి ఘటన వివరాలను తెలుసుకున్నారు.
వన్యప్రాణుల వేటకు విద్యుత్ తీగలు అమర్చడం అత్యంత ప్రమాదకరమని మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి అక్రమ చర్యలతో వన్యప్రాణులతో పాటు అటవీ సిబ్బంది, స్థానిక ప్రజల ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని అటవీ, పోలీసు అధికారులను ఆదేశించారు. నవీన్ కుటుంబానికి సానుభూతి తెలిపిన మంత్రి, నిబంధనల ప్రకారం ఎక్స్‌గ్రేషియా చెల్లించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించేలా చర్యలు తీసుకోవాలని పీసీసీఎఫ్ వినయ్ కుమార్‌ను ఆదేశించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!