

రాష్ట్రంలో న్యాయబద్ధమైన ప్రైవేటు భూములకు ప్రభుత్వం ఎలాంటి ఆటంకం కలిగించదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. 22ఏ నిషేధిత జాబితాలో ప్రైవేటు ఆస్తులు చేరడానికి గతంలో ఆన్లైన్లో లేని పాత ప్రభుత్వ జీవోలు, మెమోలు, భూ వివరాలను డిజిటల్ చేయడం కారణమైందన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని తెలిపారు. సమస్యల పరిష్కారానికి ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, ఈ నెలాఖరులోగా దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. 22ఏను అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
22ఏ జాబితాలో ప్రైవేటు ఆస్తులు చేరాయంటూ మేడ్చల్‌లో 511, రంగారెడ్డిలో 146, హైదరాబాద్‌లో 49, సంగారెడ్డిలో 38 దరఖాస్తులు వచ్చినట్లు మంత్రి వెల్లడించారు. గతంలో యూఎల్‌సీకి సంబంధించిన 325 అర్హమైన కేసుల్లోనూ సమస్యలు గుర్తించామని, అధికారుల పొరపాట్ల వల్ల సామాన్యులు ఇబ్బంది పడినందుకు చింతిస్తూ క్షమాపణలు తెలిపారు. తహసీల్దారు, ఆర్డీవో, కలెక్టర్, సబ్‌రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్లకు ఫిర్యాదులు చేయవచ్చని, 1800 599 4788 టోల్‌ఫ్రీ నంబర్‌కు కూడా ఫోన్ చేయవచ్చని చెప్పారు. మూడు రోజుల్లో సమాధానం అందేలా చర్యలు తీసుకుంటామని, రిజిస్ట్రేషన్ నిలిచిపోయిన కేసులను అత్యవసరంగా పరిష్కరిస్తామని తెలిపారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!