

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు రాజకీయ క్లియరెన్స్ రాకపోవడం వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నిబంధనలు, సాంకేతిక కారణాల వల్లే అనుమతి నిరాకరించారని తెలిపారు. ఈ అంశంపై కాంగ్రెస్ నేతలు అనవసర రాద్ధాంతం చేయడం సరికాదని అన్నారు.
రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు విదేశాలకు వెళ్లేటప్పుడు పర్యటన ఆవశ్యకత, భద్రత, అంతర్జాతీయ ప్రోటోకాల్ వంటి అంశాలను విదేశాంగ శాఖ పరిశీలిస్తుందని రాంచందర్ రావు వివరించారు. యూపీఏ హయాంలో అస్సాం సీఎం తరుణ్ గొగొయ్ పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే, గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీకి గతంలో వీసా రాకుండా కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారని విమర్శించారు.
ప్రైవేట్ మెడికల్ కాలేజీలు విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన ఫీజులను వెంటనే తిరిగి చెల్లించాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు. నాలుగున్నరేళ్ల కోర్సుకు ఐదు విడతల్లో ఫీజులు వసూలు చేస్తూ ఒక్కో విద్యార్థిపై రూ.13 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు అదనపు భారం మోపుతున్నారని ఆరోపించారు. హైకోర్టు, టీఏఎఫ్‌ఆర్‌సీ సూచనలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. హెల్త్ సెక్రటరీ, డీఎంఈ వెంటనే జోక్యం చేసుకుని విద్యార్థులు, తల్లిదండ్రులకు న్యాయం చేయాలని, లేకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!