

ఉక్రెయిన్-రష్యా యుద్ధం నాలుగేళ్లకు పైగా కొనసాగుతున్న నేపథ్యంలో.. యుద్ధానికి అవసరమైన నిధులు, రక్షణ సామర్థ్యాలను పెంచుకునేందుకు ఉక్రెయిన్ పలు మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలో పోర్నోగ్రఫీని చట్టబద్ధం చేయాలంటూ ఉక్రెయిన్ చట్టసభ్యుడు యారోస్లావ్ ప్రతిపాదించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అడల్ట్ ఎంటర్టైన్మెంట్ పరిశ్రమను చట్టబద్ధ వ్యవస్థలోకి తీసుకొచ్చి పన్నులు విధిస్తే సుమారు 25 మిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. ఆ నిధులతో దాదాపు 30 వేల డ్రోన్లను కొనుగోలు చేయవచ్చని వాదిస్తున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో అశ్లీల కంటెంట్ తయారీ, పంపిణీ, కలిగి ఉండటంపై చట్టపరమైన ఆంక్షలు ఉన్నాయి. అయినప్పటికీ అక్కడ అడల్ట్ కంటెంట్‌కు సంబంధించిన కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
ప్రస్తుత నిబంధనల్లో ఓ విరుద్ధ పరిస్థితి నెలకొందని యారోస్లావ్ పేర్కొంటున్నారు. పోర్నోగ్రఫీ చట్టపరంగా నిషేధితమైనప్పటికీ.. కొందరు అడల్ట్ కంటెంట్ క్రియేటర్ల నుంచి అధికారులు పన్నులు వసూలు చేస్తున్నారని ఆయన తెలిపారు. పన్నులు చెల్లించకపోతే చర్యలు ఎదుర్కోవాల్సి రావడం, చెల్లిస్తే అశ్లీల కంటెంట్‌కు సంబంధించిన చట్టాలను ఉల్లంఘించినందుకు కేసులు ఎదురయ్యే పరిస్థితి ఉందని ఆయన వాదిస్తున్నారు. అందుకే ఈ రంగాన్ని చట్టబద్ధం చేసి, పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చేలా ప్రతిపాదన తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. యుద్ధ సమయంలోనూ ఉక్రెయిన్ను అవినీతి ఆరోపణలు వెంటాడుతున్నాయి. రక్షణ, ఆయుధాల కొనుగోళ్లకు సంబంధించిన వ్యవహారాల్లో భారీగా నిధులు దుర్వినియోగమైనట్లు ఆరోపణలు రావడంతో దర్యాప్తు కొనసాగుతోంది. పలువురు అధికారులు, ప్రభుత్వంలోని కీలక వ్యక్తులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!