

మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేశారనే ఆరోపణలతో నమోదైన ఉపా కేసులో గాదె ఇన్నయ్య అలియాస్ గాదె ఇన్నారెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల వ్యక్తిగత బాండ్‌తో పాటు అదే మొత్తానికి రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ప్రతి శుక్రవారం కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ముందు హాజరు కావాలని, ఇలాంటి నేరాలను పునరావృతం చేయరాదని, సాక్షులను బెదిరించడం లేదా ప్రలోభపెట్టడం చేయరాదని, కేసు విచారణలో జోక్యం చేసుకోరాదని స్పష్టం చేసింది. పాస్‌పోర్టును ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టుకు అప్పగించాలని కూడా ఆదేశించింది.
సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం తీగలకుంటపల్లిలో మావోయిస్టు కె. రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ అంత్యక్రియల్లో పాల్గొని మావోయిజాన్ని ప్రోత్సహించేలా మాట్లాడారనే ఆరోపణలపై ఇన్నయ్యపై కేసు నమోదైంది. డిసెంబర్ 21న ఆయనను అరెస్ట్ చేశారు. ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ కె. లక్ష్మణ్, జస్టిస్ కె. సుజనలతో కూడిన ధర్మాసనం విచారణ అనంతరం బెయిల్ మంజూరు చేసింది. ఉపా చట్టంలోని బెయిల్ నిబంధనలు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను అధిగమించలేవని ధర్మాసనం పేర్కొంది. సుదీర్ఘకాలం జైలులో ఉండటం, ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపింది. ఇన్నయ్యకు ఇప్పటికే మూడుసార్లు వెన్నెముక శస్త్రచికిత్సలు జరిగాయని, రెండు నెలల విశ్రాంతి, ఫిజియోథెరపీ అవసరమని వైద్యులు సూచించారని కోర్టు పేర్కొంది. జైలులో ఫిజియోథెరపీ సౌకర్యం లేదన్న సమాచారాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంది. అలాగే గతంలో మంజూరైన మధ్యంతర బెయిల్ షరతులను ఉల్లంఘించినట్లు ఎలాంటి ఆరోపణలు లేవని గమనించింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!