

ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక రోబోటిక్ సర్జరీ సేవలను విస్తరిస్తూ.. ఖరీదైన వైద్య సేవలను సామాన్యులకు ఉచితంగా అందుబాటులోకి తీసుకొస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. సనత్‌నగర్‌లోని డా. మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆసుపత్రిలో స్టేట్ లెవల్ మల్టీ స్పెషాలిటీ రోబోటిక్ సర్జరీ వర్క్‌షాప్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అత్యాధునిక వైద్య రోబోటిక్ పరికరాలు, మౌలిక వసతులను పరిశీలించి.. వాటి వినియోగంపై నిపుణులతో చర్చించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 90 శాతం శస్త్రచికిత్సలను ఉచితంగా అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్రంలో వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు వచ్చే ఆరు నెలల్లో మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో అడ్వాన్స్‌డ్ రోబోటిక్ సర్జరీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి, టిమ్స్, నూతనంగా నిర్మిస్తున్న ఉస్మానియా ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రి, నిలోఫర్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని జీజీహెచ్‌లకు ఈ సేవలను విస్తరించనున్నట్లు చెప్పారు. నిమ్స్‌లో ఇప్పటికే 1,000 రోబోటిక్ శస్త్రచికిత్సలు నిర్వహించిన ఘనత సాధించిందన్నారు. టిమ్స్‌లో అంతర్జాతీయ రోగుల కోసం 100 పడకలు కేటాయించామని, రాష్ట్రాన్ని అడ్వాన్స్‌డ్ రోబోటిక్ సర్జరీ సేవల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!