

సైబర్ నేరాలు, అక్రమ లావాదేవీలకు ఉపయోగించే మనీ మ్యూల్ ఖాతాల నియంత్రణకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. సైబర్ నేరాల ద్వారా వచ్చిన సొమ్మును బదిలీ చేసేందుకు ఉపయోగించే అనుమానాస్పద ఖాతాలపై బ్యాంకులు విధించే తాత్కాలిక డెబిట్ హోల్డ్‌ను గరిష్ఠంగా 60 రోజులకు పరిమితం చేయాలని ముసాయిదాలో పేర్కొంది. ఈ ప్రతిపాదనలపై బ్యాంకులు, ప్రజల నుంచి అక్టోబర్ 2 వరకు సూచనలు, అభిప్రాయాలను ఆహ్వానించింది. తుది మార్గదర్శకాలు 2027 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే బ్యాంకులు కోరుకుంటే అంతకుముందే అమలు చేయవచ్చు.
కృత్రిమ మేధ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) సాంకేతికతల సాయంతో అనుమానాస్పద లావాదేవీలను బ్యాంకులు గుర్తించనున్నాయి. రూ.1,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంతో ఉన్న సందేహాస్పద బదిలీలను గుర్తించిన వెంటనే తాత్కాలిక డెబిట్ హోల్డ్ విధించవచ్చు. ఖాతాదారుడి సాధారణ లావాదేవీలకు భిన్నంగా ఉండటం, భారీగా నిధులు జమ కావడం లేదా సైబర్ నేరాలకు సంబంధించిన ఖాతాలతో సంబంధం ఉండటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. అనుమానాస్పద మొత్తానికే హోల్డ్ పరిమితం చేయగలిగితే మొత్తం ఖాతాను నిలిపివేయకూడదని ఆర్‌బీఐ సూచించింది. హోల్డ్ విధించిన వెంటనే కారణాలు, తొలగించుకునే విధానం, సంబంధిత అధికారి వివరాలను ఖాతాదారుడికి తెలియజేయాలి. వివరణ ఇచ్చేందుకు 20 రోజులు, అనంతరం బ్యాంకు నిర్ణయం తీసుకునేందుకు 10 రోజులు గడువు ఉంటుంది. పోలీసుల ఆదేశాలు లేకపోతే తాత్కాలిక డెబిట్ హోల్డ్ గరిష్ఠంగా 60 రోజులు మాత్రమే కొనసాగాలి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!