

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సహారన్‌పూర్ కలెక్టరేట్ ప్రాంగణంలోని ప్రభుత్వ స్థలంలో ఉన్న మసీదు కూల్చివేత వ్యవహారం రాజకీయ వివాదానికి దారితీసింది. కోర్టు ఆదేశాల మేరకు అధికారులు మసీదును తొలగించగా, సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకించాయి. సహారన్‌పూర్ వచ్చిన మహామండలేశ్వర్ ప్రబోధానంద గిరి పోలీసు అధికారులను కలిసి మసీదు తొలగింపును ప్రశంసించారు. కలెక్టరేట్ పరిపాలనకు సంబంధించిన ప్రాంతమని, అక్కడ మతపరమైన కార్యకలాపాలకు స్థానం లేదని అన్నారు. మసీదు వక్ఫ్ బోర్డుకు చెందినదన్న వాదనలపై స్పందిస్తూ, అందుకు సంబంధించిన పత్రాలు ఉంటే కోర్టులో సమర్పించాలని అన్నారు. మసీదు కూల్చివేతను వ్యతిరేకిస్తున్న వారు పాకిస్థాన్ లేదా బంగ్లాదేశ్ వెళ్లవచ్చని, ప్రయాణ ఖర్చులు భరించలేని వారికి తానే ఖర్చులు చెల్లిస్తానని చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి.
మరోవైపు, ఈ వ్యవహారంపై న్యాయపరమైన వివాదం కొనసాగుతోంది. జూలై 16న సహారన్‌పూర్ సిటీ మేజిస్ట్రేట్ మసీదును తొలగించాలని ఆదేశించడంతో పాటు రూ.6.41 కోట్ల జరిమానా విధించారు. ఈ ఉత్తర్వును సెప్టెంబర్ 2న జిల్లా కోర్టు సమర్థించింది. అనంతరం సెప్టెంబర్ 5న అధికారులు మసీదును కూల్చివేశారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ సెప్టెంబర్ 9న అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కూల్చివేత అనంతరం మసీదు శిథిలాల కింద సుమారు 20 అడుగుల లోతైన పాత బావి వెలుగులోకి రావడం కూడా చర్చనీయాంశమైంది. ఆ బావికి చారిత్రక లేదా మతపరమైన ప్రాధాన్యం ఉందా అనే అంశంపై దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎలాంటి తుది నిర్ణయానికి రావొద్దని ప్రబోధానంద గిరి సూచించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!