

తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు శుభవార్త అందించింది. రిటైర్మెంట్ సమయంలో అందించే సర్వీస్ ఎండ్ బెనిఫిట్స్‌ను గణనీయంగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనల ప్రకారం 65 ఏళ్ల వయస్సులో పదవీ విరమణ చేసే అంగన్వాడీ టీచర్లకు రూ.2 లక్షలు, అంగన్వాడీ హెల్పర్లకు రూ.1 లక్ష చొప్పున ఆర్థిక ప్రయోజనం అందనుంది. గతంలో టీచర్లకు రూ.1 లక్ష, హెల్పర్లు మరియు మినీ అంగన్వాడీ వర్కర్లకు రూ.50 వేలుగా ఉన్న సర్వీస్ ఎండ్ బెనిఫిట్స్‌ను ప్రభుత్వం రెట్టింపు చేసింది. కేంద్ర ప్రభుత్వ మిషన్ సక్షమ్ అంగన్వాడీ పోషణ్ 2.0 మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం అమలు అవుతోంది.
అంతేకాకుండా 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న అంగన్వాడీ సిబ్బంది స్వచ్ఛందంగా విధుల నుంచి వైదొలిగినా ఇదే ప్రయోజనం పొందే అవకాశం కల్పించింది. మహిళా, శిశు సంక్షేమ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 2,572 మంది అంగన్వాడీ సిబ్బందికి సర్వీస్ ఎండ్ బెనిఫిట్స్ కింద రూ.15.61 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఇందులో 473 మంది అంగన్వాడీ టీచర్లకు రూ.4.73 కోట్లు, 1,930 మంది అంగన్వాడీ హెల్పర్లకు రూ.9.65 కోట్లు చెల్లించారు. అంగన్వాడీ సిబ్బంది సేవలకు గుర్తింపుగా, వారికి ఆర్థిక భరోసా కల్పించడమే ఈ నిర్ణయం లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!