

భూ వివాదాలకు సంబంధించిన రెండు వేర్వేరు కేసుల్లో తెలంగాణ హైకోర్టు హైడ్రా (HYDRA) వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హయత్‌నగర్ మండలం సాహెబ్ నగర్ కాలనీలోని ప్లాట్ నెం.10ను ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా ఏర్పాటు చేసిన బోర్డును 24 గంటల్లో తొలగించాలని జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి ఆదేశించారు. భూమి యజమానులు ఝాన్సీతో పాటు మరో వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, భూ యజమానులకు నోటీసులు ఇవ్వకుండా ఏ ఆధారాలతో ఈ చర్యలు చేపట్టారని ప్రశ్నించింది. ఈ అంశంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఆగస్టు 11కు వాయిదా వేసింది.
మరో కేసులో కొండాపూర్‌లోని 350 చదరపు గజాల ప్రైవేట్ ప్లాటులో కాంపౌండ్ గోడ, వాచ్‌మన్ గదిని నోటీసులు ఇవ్వకుండా కూల్చివేసిన ఘటనపై జస్టిస్ ఎన్.పీ. శ్రవణ్ కుమార్ హైడ్రా, తహసీల్దార్ వ్యవహారాన్ని తప్పుబట్టారు. సర్వే నంబర్ 60లోని ప్రైవేట్ స్థలాన్ని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రాకు ఏ ఆధారాలతో సమాచారం అందించారంటూ శేరిలింగంపల్లి తహసీల్దార్‌ను నిలదీశారు. నోటీసులు జారీ చేయకుండా కూల్చివేతలు ఎలా చేపట్టారని హైడ్రాను ప్రశ్నించిన న్యాయస్థానం, ఈ నెల 30న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని తహసీల్దార్‌ను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!