

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలిరోజే సభ వెలుపల, లోపల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో కూడిన నల్ల టీషర్టులు ధరించి శాసనసభలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన భారాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. పోలీసుల తీరుపై ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల దాడిలో తనకు గాయాలయ్యాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించగా, పోలీసులపై కేటీఆర్ దాడి చేశారని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యారోపణ చేశారు. నల్ల టీషర్టులతో అనుమతించకపోతే వాటిని తొలగించి బనియన్లతోనే సభలోకి వెళ్తామంటూ హరీశ్‌రావు, ఇతర భారాస నేతలు ప్రయత్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారాస ప్రతినిధులను అదుపులోకి తీసుకుని అనంతరం తెలంగాణ భవన్‌కు తరలించారు.
ఇదే సమయంలో పోలీసులు, భారాస నేతల మధ్య జరిగిన తోపులాట నేపథ్యంలో ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలు సభలో తీవ్ర దుమారం రేపాయి. దీనిపై మధ్యాహ్నం శాసనసభ ప్రత్యేకంగా చర్చించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు, కాంగ్రెస్, భాజపా, ఎంఐఎం, సీపీఐ సభ్యులు తాతా మధు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చర్చ సందర్భంగా స్పీకర్ ప్రసాద్‌కుమార్ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. మరోవైపు నిషేధిత భూముల జాబితాకు సంబంధించిన 22ఏ అంశంపై చర్చకు పట్టుబట్టిన భాజపా సభ్యులు పోడియం వద్ద నిరసనకు దిగారు. తమ డిమాండ్‌పై చర్చ జరగకపోవడంతో సాయంత్రం సభ నుంచి వాకౌట్ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!