

భారాస నేతలు శాసనసభలో వ్యవహరించిన తీరుపై మంత్రి శ్రీధర్‌బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ స్వయంగా పోలీసులపై దాడి చేసినట్లు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నవీన్‌రెడ్డి కూడా పోలీసులపై దాడికి పాల్పడినట్లు టీవీ దృశ్యాల్లో కనిపించిందని ఆయన ఆరోపించారు. పోలీసులను అసభ్య పదజాలంతో దూషించారని పేర్కొన్నారు. సోమవారం కాంగ్రెస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, విజయ రమణారావు, రామచంద్రునాయక్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డితో కలిసి శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడారు. బ్యాడ్జీలు, ప్లకార్డులతో సభలోకి రావడం నిషేధమనే నిబంధనలను గత భారాస ప్రభుత్వమే రూపొందించిందని, టీషర్టులపై నినాదాలు రాసుకుని రావడం కూడా సభా సంప్రదాయాలకు విరుద్ధమని అన్నారు.
భారాస దళిత వ్యతిరేక పార్టీ కాదని నిరూపించుకోవాలంటే మాజీ సీఎం కేసీఆర్ శాసనసభకు హాజరై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు క్షమాపణ చెప్పాలని శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు. భారాస ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలతో స్పీకర్ మనోవేదనకు గురయ్యారని, దళిత ఎమ్మెల్యేలు కూడా తీవ్రంగా మనస్తాపం చెందారని అన్నారు. ఆ వ్యాఖ్యలను ఎమ్మెల్సీ వెనక్కి తీసుకుంటానని చెబుతున్నప్పటికీ కేటీఆర్, హరీశ్‌రావు వాటిని ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. మహిళా ఎమ్మెల్యేలకు ఇబ్బంది కలిగినట్లు సమాచారం అందగానే సీఎం రేవంత్‌రెడ్డి పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారని తెలిపారు. ఎక్కడైనా తప్పు జరిగినట్లు తేలితే విచారణ జరిపి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అవిశ్వాస తీర్మానం పెడతామంటూ కేటీఆర్, హరీశ్‌రావు చేస్తున్న వ్యాఖ్యలకు కాంగ్రెస్ భయపడదని శ్రీధర్‌బాబు అన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!