

పార్టీ పదవుల్లో ఉన్నవారు మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా పార్టీని గౌరవించాల్సిందేనని తెదేపా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. పార్టీనే సుప్రీం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. పార్టీ సంస్థాగత బలోపేతం, కార్యక్రమాల నిర్వహణపై జరిగిన చర్చలో ఆయన పాల్గొని.. పార్టీ ఏదైనా బాధ్యత అప్పగిస్తే దానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. తనకు క్వాంటమ్ టవర్స్ కార్యక్రమానికి ఆహ్వానం వచ్చినప్పటికీ, అదే సమయంలో పార్టీ అప్పగించిన పని ఉండటంతో ఆ కార్యక్రమానికి హాజరుకాలేదని లోకేశ్ తన అనుభవాన్ని వెల్లడించారు. పార్టీ ఇచ్చిన పనులను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పూర్తి చేయాలని సూచించారు.
పార్టీ పదవుల్లో ఉన్నవారు పార్టీ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు ఎవరి అనుమతీ అవసరం లేదని లోకేశ్ అన్నారు. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు బీఫారం ఇవ్వకపోతే ప్రస్తుతం ఉన్నవారిలో ఎవరూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కాలేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. పార్టీని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు ఉండదని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ నిరంతరం గుర్తుంచుకోవాలని అన్నారు. నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని, పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని లోకేశ్ సూచించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!