

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వందేమాతరం విషయంలో బీజేపీ చేస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండించారు. జాతీయ నేతలు మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, జవహర్‌లాల్ నెహ్రూ పాడిన విధంగానే తాను వందేమాతరాన్ని ఆలపించానని స్పష్టం చేశారు. తాను గేయాన్ని అసంపూర్తిగా పాడారని బీజేపీ ఆరోపించడంపై స్పందిస్తూ.. తనపై కేసులు పెడితే గాంధీ, పటేల్, నెహ్రూలపైనా కేసులు పెడతారా అని ప్రశ్నించారు. గోవాలో సోమవారం జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో ఖర్గే వందేమాతరంలోని రెండు చరణాలు మాత్రమే ఆలపించడంపై భాజపా నేతలు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు, జాతీయ గేయాన్ని రెండు చరణాలకే పరిమితం చేయడంపై బీజేపీ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేసింది. దిల్లీలో మీడియాతో మాట్లాడిన బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్.. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం జాతీయ సంప్రదాయాలతో రాజీ పడుతున్నారని కాంగ్రెస్‌పై ఆరోపించారు. వందేమాతరాన్ని గౌరవించకపోతే స్వాతంత్య్ర ఉద్యమంపై తమకే గుత్తాధిపత్యం ఉందని కాంగ్రెస్ చెప్పుకోవడం మానుకోవాలని సూచించారు. ముస్లిం లీగ్ ఒత్తిడి కారణంగానే వందేమాతరాన్ని రెండు చరణాలకు పరిమితం చేశారని ఆయన ఆరోపించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!