

పశ్చిమ బెంగాల్‌లో సంచలనం సృష్టించిన భారీ ఉగ్రవాద కుట్రను 'స్పెషల్ టాస్క్ ఫోర్స్' (ఎస్‌టీఎఫ్) అధికారులు భగ్నం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సువేందు అధికారిని లక్ష్యంగా చేసుకోవడంతో పాటు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో అలజడి సృష్టించేందుకు పథకం పన్నిన ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు. పాకిస్థాన్‌కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న హమీమ్ మండల్‌ను రెండు రోజుల క్రితం పూర్వ బర్ధమాన్ జిల్లాలో అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌టీఎఫ్ వెల్లడించింది. ఈ కేసు విచారణలో భాగంగా హమీమ్ ప్రియురాలు అర్పితా సర్కార్‌ను కూడా జార్ఖండ్‌లో అరెస్ట్ చేశారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు నిర్వహించిన నిరసన కార్యక్రమంలోకి పోలీసు యూనిఫాంలో చొరబడి, గందరగోళం సృష్టించాలని హమీమ్ మండల్‌కు పాకిస్థాన్‌లోని అతని హ్యాండ్లర్ల నుంచి ఆదేశాలు అందాయని ఎస్‌టీఎఫ్ ఐజీ గౌరవ్ శర్మ మీడియా సమావేశంలో తెలిపారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి సువేందు అధికారి కదలికలపై నిఘా పెట్టాలని, ఆయనకు భద్రత తక్కువగా ఉండే ప్రదేశాల సమాచారాన్ని సేకరించాలని కూడా అతనికి సూచించినట్లు ఐజీ వివరించారు. "ముఖ్యమంత్రి వారి లక్ష్యాల్లో ఒకరు. ఆయనపై దాడి చేసేందుకు అనువైన సమయం కోసం చూస్తున్నారు" అని ఆయన పేర్కొన్నారు.
ఈ కుట్రలో హమీమ్ ప్రియురాలు అర్పితా సర్కార్ పాత్ర కూడా కీలకమని అధికారులు గుర్తించారు. పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులను అర్పిత హనీట్రాప్ చేసి, వారి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టి హమీమ్‌కు చేరవేసేదని తేలింది. వీరిద్దరూ కలిసి రాష్ట్ర మంత్రి ఉమేష్ రే కుమారుడిని కిడ్నాప్ చేసి, డబ్బు డిమాండ్ చేయాలని కూడా పథకం పన్నినట్లు విచారణలో బయటపడింది. పాకిస్థాన్‌కు చెందిన షాజాద్ భట్టి గ్యాంగ్‌తో సంబంధమున్న హ్యాండ్లర్ల ఆదేశాల మేరకే వీరు పనిచేస్తున్నారని అధికారులు నిర్ధారించారు. అర్పిత వాట్సాప్ చాట్‌లలో పాకిస్థాన్‌తో ఉన్న సంబంధాలు బయటపడ్డాయి.
హమీమ్, అర్పిత నుంచి యూకే, మెక్సికో దేశాలకు చెందిన అంతర్జాతీయ సిమ్ కార్డులను ఎస్‌టీఎఫ్ స్వాధీనం చేసుకుంది. ఈ సిమ్‌లను ఉపయోగించి తమ పాకిస్థానీ హ్యాండ్లర్లు, స్లీపర్ సెల్స్‌తో ఎన్‌క్రిప్టెడ్ పద్ధతిలో సంభాషణలు జరిపినట్లు అనుమానిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారానే హమీమ్ ఉగ్రవాదం వైపు ఆకర్షితుడై, పాక్ ఆపరేటివ్‌ల కోసం పనిచేయడం ప్రారంభించాడని దర్యాప్తులో తేలింది. 'రాణా', 'ఉజైర్', 'అబిద్ జాట్ 333', 'హమద్' అనే కోడ్ పేర్లతో ఉన్న హ్యాండ్లర్లు షాజాద్ భట్టి గ్యాంగ్‌కు చెందిన వారని అనుమానిస్తున్నారు. ఈ గ్యాంగ్ యువతను ఉగ్రవాదం వైపు ప్రేరేపించడం, రిక్రూట్‌మెంట్లు, నార్కో-టెర్రర్ కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు ఆరోపణలున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!