

ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ మహిళా పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా సాధికారతకు సంబంధించి పలు కీలక అంశాలను వెల్లడించారు. మహిళల మద్దతుతోనే 2023 డిసెంబర్‌లో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని పేర్కొన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేసేందుకు 22 జిల్లా కేంద్రాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలను నిర్మిస్తున్నామని, ఇవి శిక్షణ, మార్కెటింగ్, వ్యాపార అభివృద్ధి కేంద్రాలుగా పనిచేస్తాయని తెలిపారు. శిల్పారామం సమీపంలో రూ.1000 కోట్ల విలువైన స్థలంలో ఇందిరా మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేశామని, గ్రామీణ హస్తకళలు, సంప్రదాయ ఉత్పత్తుల విక్రయానికి మహిళా సంఘాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.
రాష్ట్రంలోని 67 లక్షల మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.16 వేల కోట్ల రుణాలు అందించామని సీఎం తెలిపారు. మహిళా సంఘాల ఉత్పత్తులను అమెజాన్ వంటి అంతర్జాతీయ వేదికల ద్వారా ప్రపంచ మార్కెట్‌కు అనుసంధానించే చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద 1000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి, 27 వేల ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ, విద్యార్థుల యూనిఫారాల తయారీ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించినట్లు తెలిపారు. 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశాలు నిర్వహిస్తానని సీఎం హామీ ఇచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!