

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కాల్సిన భారీ మైథలాజికల్ యాక్షన్ మూవీ ‘అశ్వద్ధామ: ది సాగా’కు బ్రేక్ పడిందని ఈ ప్రాజెక్ట్ ఇకపై పట్టాలెక్కదని నిర్మాత జాకీ భగ్నాని వెల్లడించినట్లు సమాచారం. సినిమా ఆగిపోవడానికి బడ్జెట్ పెరగడం, విదేశాల్లో చిత్రీకరణ అవసరం కావడం వంటి కారణాలు ఉన్నాయని ఆయన తెలిపారు. అయితే ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ కూడా తమ సినిమాపై ప్రభావం చూపిందని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ పోషించిన అశ్వద్ధామ పాత్రకు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన తమ కథకు ప్రతికూలంగా మారిందని నిర్మాత అభిప్రాయపడినట్లు సమాచారం. ఒకే తరహా కథను పదేపదే చూపిస్తే ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటారని ఆయన భావించినట్లు తెలుస్తోంది.
డైరెక్టర్ ఆదిత్య ధర్ తొలుత విక్కీ కౌశల్‌తో ఈ కథను తెరకెక్కించాలని భావించారు. ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చకపోవడంతో షాహిద్ కపూర్‌తో రూపొందించేందుకు ప్రయత్నాలు జరిగాయి. సుమారు రెండేళ్ల క్రితం కన్నడ డైరెక్టర్ సచిన్ బి.రవి దర్శకత్వంలో సినిమా ఉంటుందని ప్రకటించారు. కానీ షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. చివరకు భారీ పెట్టుబడి పెట్టడం కంటే కథలో కొత్తదనం ఉండటం ముఖ్యమని భావించి ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ‘కల్కి 2898 ఏడీ’లో అశ్వద్ధామ పాత్ర ఉండటమే ఏకైక కారణం కాదని స్పష్టమవుతోంది. బడ్జెట్, విదేశీ చిత్రీకరణ, నిర్మాణ ప్రణాళికలు కూడా కీలకంగా మారాయి. ఇక ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ షూటింగ్ ఇప్పటికే 60 శాతానికి పైగా పూర్తయినట్లు సమాచారం. వచ్చే ఏడాది విడుదలకు నాగ్ అశ్విన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!