

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై తాత్కాలిక నిషేధం విధిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక కేడర్ల వారీగా ఉద్యోగుల కేటాయింపు పూర్తయ్యే వరకు బదిలీలు, కొత్త నియామకాలు, పదోన్నతులు, డిప్యుటేషన్లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రపతి ఉత్తర్వు–2025 ప్రకారం 26 జిల్లాలకు స్థానిక కేడర్ల ఏర్పాటు, కేడర్ సంఖ్య ఖరారు, ఉద్యోగుల పంపిణీ, అమలు విధానాలకు సంబంధించి ప్రభుత్వం సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే మార్కాపురం, పోలవరం జిల్లాలు ప్రస్తుతం ఈ ఉత్తర్వుల పరిధిలోకి రావని, ఆ జిల్లాలకు తాత్కాలికంగా ఉద్యోగులను కేటాయిస్తామని స్పష్టం చేసింది.
కొత్త జోనల్ విధానం ప్రకారం రాష్ట్రాన్ని 6 జోన్లు, 2 మల్టీ జోన్లుగా విభజించారు. మల్టీ జోన్–1లో శ్రీకాకుళం నుంచి పల్నాడు వరకు ఉన్న జిల్లాలు, మల్టీ జోన్–2లో బాపట్ల నుంచి శ్రీ సత్యసాయి వరకు ఉన్న జిల్లాలను చేర్చారు. అమరావతి రాజధాని ప్రాంతాన్ని మల్టీ జోన్–1లో చేర్చడంతో పాటు, కృష్ణా–ఎన్టీఆర్–ఏలూరు జిల్లాలు, కర్నూలు–నంద్యాల జిల్లాల మధ్య పోస్టుల పంపిణీకి ప్రత్యేక నిష్పత్తులు అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మార్గదర్శకాలు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, సచివాలయం, హెచ్‌వోడీ కార్యాలయాలు, హైకోర్టు పోస్టులకు వర్తించవని స్పష్టం చేసింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!