

అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 20వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఏడాది డిసెంబరు నుంచి పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఎస్క్రో ఖాతాల్లో జమ చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించడం అవసరమేనని, అయితే రాష్ట్ర ఆర్థిక సామర్థ్యానికి అనుగుణంగా వాటిని అమలు చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ పారిశ్రామిక ప్రాజెక్టులు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు. పరిశ్రమలు, ఇంధనం, సమాచార సాంకేతికత, ఎలక్ట్రానిక్స్, ఆహార శుద్ధి రంగాలకు చెందిన 25 ప్రాజెక్టులకు రూ.2,08,406 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 21,627 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది.
ఇప్పటివరకు జరిగిన 20 రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశాల్లో 363 ప్రాజెక్టులకు సంబంధించి రూ.13.78 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించిందని, వీటి ద్వారా 10.86 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. హరిత అమ్మోనియా, లిథియం బ్యాటరీలు, రోబోటిక్స్ వంటి భవిష్యత్ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలోని పారిశ్రామిక ప్రాజెక్టులపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, సమాచార కేంద్రాలపై ఉన్న అపోహలను తొలగించాలని ఆదేశించారు. పరిశ్రమల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కలిగే ప్రయోజనాలను నిరంతరం విశ్లేషించాలని, పర్యాటక రంగాన్ని ఆకర్షించేలా హోటల్ ప్రాజెక్టులకు ప్రత్యేక నిర్మాణ శైలిని ప్రోత్సహించాలని సూచించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!