

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం 57 అజెండా అంశాలకు ఆమోదం తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికలను అక్టోబర్‌లో నిర్వహించేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33⅓ శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఆమోదించింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు ఉండదని, ప్రస్తుతం అమల్లో ఉన్న రిజర్వేషన్లు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. కేంద్రం నుంచి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులను పొందేందుకు ఎన్నికలను త్వరగా నిర్వహించాల్సిన అవసరం ఉందని కేబినెట్ అభిప్రాయపడింది.
పట్టణ స్థానిక సంస్థల్లో మేయర్లు, చైర్మన్లను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకునే విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీల్లో ఈ విధానం అమలు కానుంది. అలాగే ప్రస్తుతం ఉన్న 13 జిల్లా పరిషత్‌లను 28 జిల్లా పరిషత్‌లుగా ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా కొత్త జెడ్పీల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించనున్నారు. బీసీ రిజర్వేషన్లపై ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు కేబినెట్‌కు వివరించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!