

తమిళనాడు, కర్ణాటక మధ్య చాలాకాలంగా కొనసాగుతున్న మేకెదాటు ఆనకట్ట వివాదం మరోసారి రాజకీయంగా వేడెక్కింది. మైసూరులో ప్రధాని మోదీ సమక్షంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ మాట్లాడుతూ.. మేకెదాటులో ఆనకట్ట నిర్మాణాన్ని ఎవరూ అడ్డుకోలేరని, ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం తుది ఆమోదం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఆయన వ్యాఖ్యలపై తమిళనాడులోని డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు నష్టం కలిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ, కర్ణాటక వైఖరిని వ్యతిరేకించింది.
ఈ నేపథ్యంలో డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్‌కు లేఖ రాశారు. కర్ణాటక ముఖ్యమంత్రి వ్యాఖ్యలు తమిళనాడు రైతుల్లో ఆగ్రహాన్ని కలిగించాయని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండకూడదని పేర్కొన్నారు. తమిళుల ఐక్యతను చాటడంతో పాటు కర్ణాటక వైఖరిని వ్యతిరేకించేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కోరారు. మాజీ మంత్రి టీఆర్బీ రాజా కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరిని ప్రశ్నించారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మేకెదాటు ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తుండగా, తమిళనాడు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న అదే పార్టీ తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కూడా స్పందించాలని కోరారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!