

అబద్ధాలు, అసత్యాలతో ప్రజలను మభ్యపెడుతున్న గొడ్డలి పార్టీని రాజకీయాల నుంచి తరిమికొట్టాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. మహిళలను అవహేళన చేసే ఆ పార్టీ నాయకులను ప్రజలే నిలదీయాలని అన్నారు. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మాట్లాడిన ఆయన పాలకొల్లు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. గత టీడీపీ ప్రభుత్వంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రూ.200 కోట్లతో పనులు ప్రారంభించగా, అనంతరం వచ్చిన ప్రభుత్వం ఆ పనులను రద్దు చేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజ్జేశ్వరం నుంచి గోదావరి జలాల మంచినీటి పథకాన్ని పునరుద్ధరించి పనులు చేపట్టినట్లు చెప్పారు.
పాలకొల్లులో టిడ్కో గృహాలను లబ్ధిదారుల పేరుతో తాకట్టు పెట్టి రూ.160 కోట్ల నిధులను దారి మళ్లించారని నిమ్మల రామానాయుడు ఆరోపించారు. అసంపూర్తిగా ఉన్న టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి మరో రెండు నెలల్లో లబ్ధిదారులకు అప్పగించేలా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. వైసీపీ పాలనపై నిమ్మల గతంలోనూ పలు విమర్శలు చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!