

ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న స్మార్ట్ కిచెన్లపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలను విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఖండించారు. స్మార్ట్ కిచెన్ల ద్వారా విద్యార్థులకు రుచికరమైన, పరిశుభ్రమైన, నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడంతో పాటు మహిళలు, పేదలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లాలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు వల్ల ఇప్పటికే పనిచేస్తున్న కుక్-కమ్-హెల్పర్ల ఉద్యోగాలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని స్పష్టం చేశారు.
వైఎస్సార్ కడప జిల్లాలోని ఐదు స్మార్ట్ కిచెన్ల పరిధిలో పనిచేస్తున్న 233 మంది కుక్-కమ్-హెల్పర్లు యథావిధిగా విధులు నిర్వహిస్తున్నారని, కొత్తగా ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ కిచెన్ల ద్వారా హెడ్ కుక్స్, అసిస్టెంట్ కుక్స్, హెల్పర్లు, డ్రైవర్లకు అదనపు ఉపాధి లభిస్తుందని తెలిపారు. జిల్లాలోని 3,450 మంది కుక్-కమ్-హెల్పర్లకు ఏప్రిల్ 2026 వరకు గౌరవ వేతనాలు పూర్తిగా చెల్లించామని, మే నెలలో వేసవి సెలవుల కారణంగా చెల్లింపులు ఉండవని, జూన్ నెల ఇంకా పూర్తికాలేదని వివరించారు. స్మార్ట్ కిచెన్లపై వస్తున్న ఆరోపణలు వాస్తవాలకు విరుద్ధమని మంత్రి పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!